Sunday, December 29, 2013

మంచి వాక్యాలు - 3

శ్రమ శరీరాన్ని పరిపుష్టం చేసినట్లే కష్టాలు బుద్దిని పరిపుష్టం చేస్తాయి.

ధనమే మాట్లాడే చోట సత్యం గొంతు నొక్కివేయబడుతుంది.

పిరికివాడు తన ప్రాణాన్నేకాక ఇతరుల జీవితాన్ని కూడా బలి తీసుకుంటాడు.

దుర్మార్గునికి మేలు చేయడం సన్మార్గునికి హాని చేసినంత ప్రమాదకరం.

Wednesday, December 25, 2013

మంచి వాక్యాలు-2

నీవు నిటాపుగా నిలబడితే చాలు , నీ నీడ వంకరగా ఉన్నా దిగులులేదు. - చైనా సమెత
ఉన్నత స్థానాలను చేరేకొదీ, మన నడకలో ఉదాత్తత పెరగాలి - సిసిరో
తీరని ప్రధమిక అవసరాలు,పేదరికం, అసమానతలమధ్య ఏ ప్రజాస్వామ్యమైనా ఎక్కువకాలం మనలేదు - జవహర్ లాల్ నెహ్రూ
చీమలు మంచి పౌరులు, వాటికి సమాజ ప్రయోజనమే ప్రధానం
హ్రుదయం కల్మషం అయితే అది చూపులలోనే ప్రతిఫలిస్తుంది.

Tuesday, December 24, 2013

ధర్మో రక్షతి రక్షితః

"ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్"
- మనుస్మృతి

ధర్మమనే పురుషార్థంలో నైతికమైన అవగాహన ఉంది. ధార్మిక చింతనము చోటు చేసుకొని ఉంది. ఇది వివేకానికి సంబంధించిన విషయం. విచారించే బుద్ధి కరువై, కేవలం సహజాతాలపై ఆధారపడి జీవించే జంతుజాలం ఈ ధర్మ పురుషార్థం వద్దకు చేరలేవు. ఇది కేవలం వివేకవంతులైన మానవులకే సంబంధించిన పురుషార్థం. మొదటి రెండు పురు షార్థాలైన అర్థకామాలను సాధించుకోవడంలో మనిషి సన్మార్గంలోనే చరించాలి. బుజుమార్గం లోనే పయనించాలి. ఇదే ధర్మజీవనం. చతుర్విధ పురుషార్థాలలో మూడవ పురుషార్థము.
నీ విషయంలో ఇతరులు ఎలా ఉండాలని భావి స్తావో, నీవు ఇతరుల విషయంలో అలాగే ఉండాలి. నీ విషయంలో ఇతరులు ఎలా ప్రవర్తించ కూడదని నీవు ఆశిస్తావో, నీవు ఇతరుల విష యంలో అలా ప్రవర్తించకుండా జీవించాలి. ఇదే ధర్మస్పహ. ధర్మమార్గం. ధర్మాన్ని ఎట్టి పరిస్థితు లలోను మానవులు అతిక్రమించకూడదు.
దారితప్పిన వారిని శిక్షించేందుకు, లేదా సంస్క రించేందుకు చట్టాలున్నాయి. దారితప్పిన మనిషి చట్టాన్ని కూడా తప్పించుకొనే ప్రయత్నం చేస్తాడు. మనిషి చట్టం కళ్లు కప్పి తప్పించుకోవచ్చు. కానీ ధర్మం, దైవం కళ్లు కప్పలేడు అంటూ మతం రంగప్రవేశం చేస్తుంది. భావం అంకురించనిదే కర్మ ఆచరింపబడదు. భావము కూడా కర్మే. మానస కర్మ. స్థూలకర్మకు స్థూలఫలితం ఎలా ఉంటుందో, భావన అనే సూక్ష్మకర్మకు సూక్ష్మఫలితం ఉంటుంది. ఈ సూక్ష్మఫలితాలే పాపపుణ్యాలు.
కర్మలు మానవాధీనాలు. ఫలితాలు దైవా ధీనాలు. చట్టాన్ని మనిషి తప్పించుకోవచ్చు. కాని పాపాన్ని తప్పించుకోలేడు. మానవనిర్మితమైన చట్టం మనిషికి న్యాయం చేయకపోవచ్చు. కానీ పుణ్యఫలం అతని కొరకు నిరీక్షిస్తూనే ఉంటుంది.
ధర్మం పవిత్రమైంది. ధర్మం దైవానికి ప్రతి రూపం. అర్థకామాలను వాంఛించేవారు ధర్మ బద్ధంగా జీవించడం అలవరచుకోవాలి. ధర్మంతో కూడిన కామం, ధర్మబద్ధమైన అర్థం సుఖ శాంతుల్ని పెంపొందిస్తాయి.
"చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;
రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;
కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు
మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి"
= స్వామి దయానంద - పండిత గోపదేవ్ ఆధారంగా
జ్ఞానం అన్నదే ప్రత్యక్షంగా మోక్షసాధనం
ధర్మం అన్నది పరోక్షంగా మోక్షసాధనం;
అంతేకాక, ముక్తపురుషుల తదుపరి కర్తవ్యం
           
మనిషి జ్ఞానగామిగా వెంటనే కాలేకపోయినా,
తాను నమ్మిన ధర్మాచరణను మాత్రం ఎలాంటి పరిస్థితులలోనూ వీడరాదు:
కనుకనే, బుద్ధ ధర్మం ప్రకారం –
"ధర్మం శరణం గచ్ఛామి"

సత్పురుషుని లక్షణం

సంపదలు గల్గు తఱి మహాజనుల హృదయ
మభినవోత్పల కోమలం బగుచు వెలయు
నాపదలు వొందునపుడు మహా మహీధ
రాశ్మ సంఘాత కర్కశం బై తనర్చు
                                                                                                 - భర్తృహరి శతకము
    లోకంలో అధికారం, సంపద రాగానే కొందరి పద్దతే మారిపోతుంది. డాబూ, దర్పం వచ్చేస్తాయి. కన్నూ, మిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తారు. సంపదలు పోయి ఆపదలు సంభవించగానే నిరాశచెంది జీవితంపై విరక్తి చెంది బాధలు పడతారు. ఇది మంచివాడి లక్షణం కాదు.
    మంచివాడు ఎవడూ అంటే - సంపదలు ఉన్నా గర్వపడక వినయంగా ఉంటూ, అప్పుడే వికసించిన తామరపూవులా కోమలంగా ఉండాలి. అందర్నీ మంచితనంతో ఆకట్టుకోవాలి. ఆపదలు సంభవించినా సంపదలు పోయినా ధైర్యం కోల్పోకుండా, నిరాశ చెందకుండా, గండశిలలా స్థిరత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అదే సత్పురుషుని లక్షణం.

Monday, December 23, 2013

సుఖాలు వస్తాయనే ఆశ మానవజీవితానికి శ్వాస

ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుఁడయ్యును నభివృద్ధిఁజెందు సోముఁ
డివ్విధమున విచారించి యొడలుఁదెగిన
జనములనుఁదాప మొందరు సాధు జనులు
మనుజునికి కష్టాలు తప్పవు. కష్టాలు ఉన్నప్పుడే సుఖాలకు విలువ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడే గుండె రాయి చేసుకోవాలని చెపుతారు. చెట్టు చూడండి. దాన్ని ఎవరు నరికివేసినా మళ్ళే చిగురు వేసి మొలుస్తుంది. చంద్రుడు తనకాంతిని పోగొట్టుకొన్నాగానీ పున్నమినాటికి మళ్ళీ కాంతిమంతుడవుతాడు. కాబట్టి శీలవంతులు బాధలతో కృఉంగిపోకుండా మళ్ళీ మంచికాలం వస్తుందని, అభివ్రుద్ది చెందే సమయం వస్తుందని ఆశిస్తారు. అటువంటివాళ్ళు నిత్య సంతోషులవుతారు. లేకపోతే జీవితం అంధకార బంధురమైపోతుంది. కష్టాలుపోయి సుఖాలు వస్తాయనే ఆశ మానవజీవితానికి శ్వాస అని సందేశనిస్తున్నాడో కవి..! 

Sunday, December 22, 2013

మంచి వాక్యాలు -1

నిలకడ లేనివాడు  సూత్రాలను చొక్కా లకంటే తేలిగ్గా మారుస్తాడు
ఇతరులతొ పంచుకున్నా పెరిగేది ప్రేమమాత్రమే
సాహసవంతుడు ఒక్కసారే మరణిస్తాడు. కానీ, పిరికివాడు చనిపోయేముందు అనేకసార్లు మరణిస్తాడు.
భిన్నత్వంలో ఏకత్వం కనుగొనడమే జ్ఞానం
ఉచితసలహా ఇచ్చేకంటే కార్యాచరణలో చేయి కలుపు.

Saturday, December 21, 2013

నమ్మరానట్టి వానిని నమ్మరాదు

నమ్మరానట్టి వానిని నమ్మరాదు
నమ్మదగువానిని మితిమీరి నమ్మరాదు 
తనదు స్నేహితు( డొక వేళ గినిసెనేని 
వాడు కలగుట్టులన్నియు బయటపెట్టు 

ఇది చాణక్యనీతి.  అందర్నీ నమ్మకూడదు. ముందుగా ఎవర్ని నమ్మరాదో ప్రవర్తన ద్వారా తెలుసుకోవాలి. నమ్మినతర్వాత కూడా ఆ వ్యక్తిని మరీ ఎక్కువగా నమ్మరాదు. ఒకవేళ పరిస్థితులు మారి అతను మన శత్రువైతే - అప్పుడు మన లోపాలను, రహస్యాలను బయలుచేసే ప్రమాదం ఉంది.

Friday, December 20, 2013

ఆత్మవిశ్వాసం

    అభివృద్దిని  కాంక్షించే ప్రతీ  ఒక్కరూ తమ ప్రయత్నం ఫలిస్తుందనే ద్రుఢనిశ్చయంతో కృషి చేయాలి . ఆత్మవిశ్వాసం మన గమ్యాన్ని చేరడానికి ఇందనంగా పని చేస్తుంది .
    ఆర్ధిక స్తోమత కుటుంబ హోదా వంటివి చిన్నతనంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోడానికి అడ్డుగోడగా ఉండిపోతే భావి భవిత నిర్మాణానికి అవసరమైన గట్టి పునాదులు ఏర్పడవు .
   ప్రతీ ఒక్కరూ తమ విజయాన్ని సాధించే లోపు ఎన్నో పరాజయాలనూ ఎదుర్కోవలసి వస్తుంది .ప్రతీ పరాజయాన్నుంచీ నేర్చుకోవలసిన గుణపాఠాలు ఎన్నో ఉంటాయి .
                                       -----------------------***---------------------

చీకటిని చూడనివానికి వెలుగులోని అందం , ఆనందం తెలియదు. వెలుగును చూడనివారికి చీకటిలోని ఆంతర్యం బోధపడదు.

Thursday, December 19, 2013

అనుకూల మిత్రులు, ప్రతికూల మిత్రులు

అఘము వలన మరల్చు హితార్థ కలితు ఁ
జేయు, గోప్యంబు దాఁచు ఁ, బోహించు గుణము
విడువఁడాపన్ను లేవడి వేళ నిచ్చు
మిత్రుఁడీ లక్షణంబుల మెలంగు చుండు

మిత్రులలో అనుకూల మిత్రులు, ప్రతికూల మిత్రులు ఉంటారు . పై పద్యంలో అనుకూల మిత్రులెవరో వివరిస్తున్నాడు భర్తృహరి.
పాపకార్యాలు చేయనివ్వకపోవడం , సత్కార్యాలు చేయడానికి ప్రోత్సహిస్తూ సహకరించడం , మిత్రుని రహస్యాలు గోప్యంగా ఉంచడం , సుగుణముల అభివృద్దికి తోడ్పడడం , అవసరమైనప్పుడు సహాయం చేసి ఆదుకొనడం - ఇవీ అసలైన మిత్రుని లక్షణాలు  ఇటువంటి గుణాలు గల వ్యక్తినే మిత్రునిగా భావించాలి - మిత్రునిగా ఎన్నుకోవాలి .
ఈ లక్షణాలు లేకుండా స్నేహం చేసేవాడు ప్రతికూల ( వ్యతిరేక ) మిత్రుడన్నమాట..!