Monday, November 27, 2023

రమణ మహర్షి విశేషాలు

 *రమణ మహర్షి విశేషాలు*


1) రమణ మహర్షి ప్రత్యక్ష సుబ్రహ్మణ్య స్వామి అవతారం
2) వారు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అరుణాచలం వెళ్ళారు.
3) వారు శరీరం విడిచి పెట్టే వరకు అరుణాచలం విడిచిపెట్టలేదు.
4) వారు శరీరాన్ని విడిచిపెట్టిన సమయంలో, 5 జ్యోతులు ఆకాశంలోకి వెళ్లి అరుణాచల పర్వతంలో కలిసిపోయాయి
5) వారు చాలా సంవత్సరాలు ఏమీ తినకుండా, నీరు కూడా తాగకుండా తపస్సు చేశారు
6) వారు కుక్కలు / కోతులు / నెమళ్ళు / పులులు / ఆవులు / ఏనుగులు మొదలైన వాటితో మాట్లాడేవారు.
7) ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో వారు తెలుసుకోగలరు
8) వారి సమక్షంలో, జంతువులన్నీ తమలోని నిజమైన శత్రు భావనను మరచిపోయి స్నేహంగా ఉండేవి.
9) వారు తన తల్లికి ముక్తిని ఇచ్చారు- కొన్ని కోట్ల జన్మల కర్మలను కొన్ని గంటలలో సూక్ష్మ శరీరముతో అనుభవింప చేసారు
10) మహర్షి చాలా సాదా సీదా జీవితాన్ని గడిపేవారు
11) మహర్షి ప్రతి వారం అరుణాచల పర్వతం గిరి ప్రదక్షిణ 2/3 రోజులు చేసేవారు.
12) వారు చాలా సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదు
13) వారిని మౌన స్వామి అనే పేరుతో పిలిచే వారు
14) తరువాత కావ్యకంఠ గణపతి మునితో మొట్టమొదటి సారిగా మాట్లాడారు.
15) కావ్యకంఠ గణపతి ముని వారికి - భగవాన్ శ్రీరమణ మహర్షి అనే పేరు పెట్టారు.
16) మహర్షి ఉపదేశ సారము & అరుణాచల అక్షర మణిమాల అని పిలువబడే 2 ప్రసిద్ధ రచనలను లోకానికి ఇచ్చారు
17) చాలా మంది సిద్ధ పురుషులు - జంతువుల రూపంలో మహర్షిని సేవించేవారు
18) మహర్షి ఆ యొక్క సిద్ధ పురుషులు శరీరము విడిచి పెట్టిన తర్వాత - వారందరికిీ భూమిలో దహన సంస్కారాలు చేశారు
19) ఇప్పటికీ వారి సమాధులను మనం రమణ మహర్షి ఆశ్రమంలో చూడవచ్చు
20) మహర్షి తనను చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరి మనస్సులను చదవగలరు
21) దేశవిదేశాల నుండి భక్తులు మహర్షిని కలవడానికి వచ్చేవారు
22) మహర్షి తన చుట్టుూ ఉండే జంతువులకు జీడిపప్పు/బాదం పెట్టే వారు
23) మహర్షి కేవలం గోచీ మాత్రమే ధరించేవారు

Friday, November 24, 2023

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం స్థలపురాణము

 స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం, కాణిపాకం స్థలపురాణము


కలియుగమున భూలోకము నందు దేశ క్షేమము కొరకు, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయుటకు, భక్తుల మనోభీష్టములు నెరవేర్చుటకు శ్రీ వినాయక స్వామి వారు సంకల్పించుకొనిరి.
ఆసమయమున అనగా సుమారు 1000 సంవత్సరముల పూర్వం బాహుదా నదీ తీరమున విహారపురిగా పిలవబడే ఈ ప్రాంతము నందు దైవ భక్తి పారాయణులు అయిన ముగ్గురు అవిటి సోదరులు (మూగ, చెవిటి, గ్రుడ్డి) తనముతో బాధపడుచూ వారికి గల కొంత వ్యవసాయ భూమి పైన ఆధారపడి జీవనము సాగిస్తూ నిత్యం భగవద్ధ్యానములో నిమగ్నమైయుండేవారు.
ఈ ప్రాంతం ప్రజలు కరువుతో పంటలు పండక ఆకలి దప్పికలతో బాధపడుచున్న సందర్భమున, ప్రజాక్షేమము కోరి అవిటి సోదరులైన ఆ ముగ్గురు ఒక శుభ దినమున సకల విఘ్నహరుడు, కోరిన కోర్కెలు తీర్చు గణపతిని ముందుగా పూజించి వారి వ్యవసాయ భూమి యందు బావిని త్రవ్వుట ప్రారంభించిరి. అప్పుడు త్రిలోక పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంతం ప్రజలను అనుగ్రహించుటకు నిర్ణయించుకొని సాక్షాత్తు కైలాసము నుండి దిగి వచ్చి తవ్వుచున్న బావి నందు రాతి రూపమును దాల్చి ఆసీనులై ఉండిరి.
ఆ ముగ్గురు సోదరులు సదరు రాయిని పగుల గొట్టుటకు గడ్డపారతో బలంగా కొట్టగా, గడ్డపార తగిలిన వెంటనే ఆ రాయి నుండి తీవ్ర రక్తస్రావం జరిగినది. స్వామి రక్త స్పర్శ మాత్రంతోనే వారి అవిటితనం తొలగిపోయినది. వెంటనే ఇక్కడ ఏదో దైవశక్తి ఉన్నదని గ్రహించి చుట్టూ త్రవ్వి చూశారు. అప్పుడు అక్కడ మహా గణపతి విగ్రహం వారికి సాక్షాత్కరించింది. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామస్థులు వచ్చి బావిలోని శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారి రక్తం కలిసి ఎకరం పాతిక భూమి ప్రవహించినది.
"కాణి" అనగా ఎకరం పాతిక భూమి "పారకం" అనగా ప్రవహించడం. ఎకరం పాతిక భూమి వరకు నీరు ప్రవహించినందున “కాణిపారకం” క్రమేపీ “కాణిపాకం" గా మారినది. శ్రీ స్వామివారు అనుగ్రహించుట వలన ఇక్కడ మంచి వర్షాలు పడి, ఈ ప్రాంతము సుభిక్షంగా మారినది.
ఆ తరువాత మంచి పంటలు పండి ప్రజలు అంతా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉన్నారు. అందుచేత ఇక్కడ కోరిన వరములు వెంటనే తీర్చుట వలన స్వామివారికి "వరసిద్ధి వినాయకుడు" అని పేరు వచ్చియున్నది. అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతమును పరిపాలించు మహారాజులు అందరూ కలిసి దేవాలయ నిర్మాణము చేసి ప్రతినిత్యం శ్రీ స్వామి వారికి,  శైవాగమోక్తముగా పూజాదికములు నిర్వహించుచున్నారు. నాటి నుండి నేటి వరకు కూడా శ్రీ స్వామి వారు దిన దినాభివృద్ధిగా పెరుగుతున్నారు.