Friday, October 27, 2023

జీవితం...(కవిత)

 జీవితమనే పుస్తకంలోని ఓ పేజీలో 

అందంగా అక్షరాలు వ్రాసి 

ఎన్నెన్నో రంగులడ్డాను...

ఎక్కడి నుంచో వచ్చిన ఓ కన్నీటి బొట్టు

అక్షరాలను చెరిపేసింది

చెదరిన వాక్యాలు మసగబారిన కలలు కాగా

కలిసిన రంగులు చీకటిగా కనిపించాయి...

అయినా 

పుస్తకం నా బుజం తట్టింది..

కలం పట్టి మరో  పేజీ తిప్పాను..

Sunday, August 12, 2018

ఉత్తములు - మధ్యములు - అధములు : లక్షణాలు



ఆలోచనల, ప్రవర్తనా ధోరణి బట్టి మన సమాజంలో మూడు రకాల మనుషులు ఉన్నారు. వారు అధములు, మధ్యములు, ఉత్తములు.

అధములు:


  • తమంతట తామే వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.  అయితే వాటిని స్థిరంగా తీసుకోలేరు.
  • మిత్రులను తరచూ మారుస్తుంటారు. అందుకే వీరికి మిత్రులూ తక్కువే
  • వీరు సంబంధాలను నిలకడగా ఉంచుకోరు.
  • వీరి ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు.
  • డబ్బు విలువ తెలీదు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. అప్పులు కూడా ఎక్కువ.
  • చదువు విలువ తెలీదు.
  • సమయపాలన ఉండదు. ఏ పనీ టైంకు చేయరు.
  • వీరు ఎవర్నీ నమ్మరు. నమ్మినట్లు నటిస్తారు అంతే.
  • వీరికి నీతి వాక్యాలు  రుచించవు. తనకు ఎవరైనా మంచి చెపితే వారిపైనే విరుచుకు పడతారు.
  • వీరు అనుక్షణం ఎదుటివారిలో తప్పులు వెతుకుతుంటారు.
  • దేవుడిని నమ్మరు. తన తర్వాతే దేవుడు అనుకుంటారు.
  • తమకు జరుగుతున్న కష్టాలకు ఎదుటివారిని, దేవుడిని నిందిస్తారు.
  • బద్ధకం ఎక్కువ. ఎక్కువ నిద్రపోతూ ఉంటారు.
  • వీరు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. 
  • పొగడ్తలకు దాసోహం అవుతారు. పొగడ్తలతో వీరిని లొంగదీసుకోవచ్చు.
  • అంతేకాదు, వీరికి భయంకూడా ఎక్కువే. ప్రతీదానికీ విపరీతంగా భయపదిపోతూ ఉంటారు.
  • వీరికి “తాను” అనే స్వార్ధం ఎక్కువ. తన గురించి మాత్రమె ఆలోచిస్తారు.


మధ్యములు:


  • వీరు నిర్ణయాలు స్వంతంగా తీసుకోలేరు. ఎదుటివారిపై ఆధారపడతారు.
  • వీరికి స్నేహితులు ఎక్కువ. అన్నిరకాల స్నేహితులూ ఉంటారు.
  • సంబంధాలను తెంచుకోకూడదు అనుకుంటారు. కానీ సాధ్యం కాదు.  
  • అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటారు. అయితే వారిలో ఏదైనా లోపం కనిపిస్తే ఇక మళ్ళీ వారి ముఖం చూడరు.
  • డబ్బు సంపాదించడమే గొప్ప అనుకుతారు. ఏంతొ సంపాదించినా  అది ఖర్చు పెట్టలేరు. పిసినారిగా ఉంటారు.
  • వీరు ఒకర్ని నమ్మితే వారితోనే ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటారు. మిగతావారి మాటలను లెక్క చేయరు.  
  • తాను నమ్మిన దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. అయితే వేరే దేవుళ్ళను విమర్శిస్తూ ఉంటారు.
  • కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయి దేవుడిపై భారం వేస్తారు.
  • ఎదుటివారు తప్పులు చేసినప్పుడు మొగమాటం వల్ల చెప్పలేరు.
  • పొగడ్తలు అంటే వీరికి పడదు.
  • భయం కలిగినప్పుడు వేరొకరి సహాయం తీసుకుని బయటపడడానికి చూస్తారు.
  • సమయం విలువ తెలిసినా పాటించలేకపోతారు.
  • వీరికి తన కుటుంబం అనే స్వార్ధం ఎక్కువ. తానూ,తన కుటుంబం బాగుంటే చాలు. ప్రపంచం గురించి అవసరం లేదు.


ఉత్తములు :


  • అన్ని విధాల ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నా లెక్కచేయరు.
  • తన ఆలోచనలకు సరితూగే స్నేహితులను మాత్రమె ఎంచుకుంటారు. వీరికి స్నేహితులు తక్కువ.
  • మానవ సంబంధాలపై గౌరవం ఎక్కువ. సంబంధాలను తెంచుకోవాలనుకోరు.
  • ఎదుటివారిలో మంచిని చూస్తారు. వారు ఏదైనా తప్పులు చేస్తే చెప్పడానికి వెనుకాడరు. అలాగే మంచిపని  చేస్తే పొగడడానికీ వెనుకాడరు.
  • డబ్బు విలువ తెలుసు. ఎప్పుడు ఖర్చు పెట్టాలో అప్పుడు ఖర్చుపెడతారు.
  • అందరినీ సమదృష్టితో చూస్తారు.   
  • దేవుడు ఒక్కడే అని అందరు దేవుళ్ళూ సమానమే అని నమ్ముతారు.
  • కష్టాలు వచ్చినప్పుడు సహనంతో ఉంటారు. వాటి నుంచి భయపడడానికి అన్ని మార్గాలనూ వెతుకుతుంటారు.
  • ఎదుటివారి కష్టాలలో సాయపడుతూ ఉంటారు.
  • ఖచ్చితమైన సమయపాలన పాటిస్తారు. ప్రతీపనీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
  • వీరు అంతః సౌందర్యానికి విలువ ఇస్తారు. 
  • ధైర్యంగా ఉంటారు. అంతేకాదు ఎదుటివారికీ ధైర్యాన్ని ఇస్తారు.
  • ఎవరైనా పొగిడితే ఎలా తీసుకుంటారో, తిట్టినా అలాగే తీసుకుంటారు.
  • వీరికి సమాజంపై బాధ్యత ఎక్కువ. వీరు తనతోపాటూ సమాజం కూడా బాగుపడాలి అనుకుంటారు.


భగవద్గీతలో భగవానుడు చెప్పిన శ్లోకం

య‌ద్య‌దాచ‌ర‌తి శ్రేష్ఠః త‌త్త‌దేవేత‌రో జ‌నః

స య‌త్ప్ర‌మాణం కురుతే లోక‌స్త‌ద‌నువ‌ర్త‌తే


దీని అర్ధం - ఉత్తములైన వారు దేనిని ఆచ‌రిస్తారో, దానినే ఇత‌రులు కూడా ఆచ‌రిస్తారు.. అలానే ఉత్తములు దేనిని అయితే ప్రమాణముగా అంగీక‌రిస్తారో లోక‌మంతా కూడా దానినే అనుస‌రిస్తుంది అని.

అందుకే మనకు తారసపడే ఉత్తముల లక్షణాలను ఆచరణ చేద్దాం. మనం ఏ కోవకు చెందుతామో విశ్లేషించుకొని ఉత్తమ లక్షణాలను అలవర్చుకోడానికి ప్రయత్నిద్దాం.


Monday, January 6, 2014

మంచి వాక్యాలు - 5

కార్యశూరులు కన్నీరు కారుస్తూ కాలాన్ని వృధా చేయరు. 
ఎంచి చూడగా లోకమందు మంచి చెడ్డలు రెండే కులములు - గురజాడ 
భారత దేశ భవిష్యత్తు తరగతి గది నుండే రూపు దిద్దుకుంటుంది. 
ఎ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని - రాయప్రొలు. 
నిజమైన భారత దేశం గ్రామాల్లోనే ఉంది .  -గాంధీ 
సత్ప్రవర్తన అనేది తనకు తానే ఇచ్చుకొనే బహుమానం - సిసిరో 
 

Friday, January 3, 2014

మంచి వాక్యాలు - 4

తెలివిగలవాడు పుస్తకాల్నే కాక జీవితాన్నీ అధ్యయనం చేస్తాడు.
చెడును సహించినవాడు మంచిని మలినపరిచినట్లే.!
మూఢనమ్మకాలు లేనివారికి మృత్యుభయం లేదు                           - గురునానక్
నిదానంగా వాగ్ధానం చేసేవాడు, దానిని నమ్మకంగా నెరవేరుస్తాడు          - రూసో
చేసినదాన్ని చెప్పడంకంటే, చెప్పినదాన్ని చేయడం చాలా కష్టం           - గోర్కీ
ఒక్క చిన్న సిరాచుక్క కోట్లాది ఆలోచనలకు వేగుచుక్క
వ్యక్తిగా ప్రతీవారినీ గౌరవించు.. కానీ, పూజించకు.

Sunday, December 29, 2013

మంచి వాక్యాలు - 3

శ్రమ శరీరాన్ని పరిపుష్టం చేసినట్లే కష్టాలు బుద్దిని పరిపుష్టం చేస్తాయి.

ధనమే మాట్లాడే చోట సత్యం గొంతు నొక్కివేయబడుతుంది.

పిరికివాడు తన ప్రాణాన్నేకాక ఇతరుల జీవితాన్ని కూడా బలి తీసుకుంటాడు.

దుర్మార్గునికి మేలు చేయడం సన్మార్గునికి హాని చేసినంత ప్రమాదకరం.

Wednesday, December 25, 2013

మంచి వాక్యాలు-2

నీవు నిటాపుగా నిలబడితే చాలు , నీ నీడ వంకరగా ఉన్నా దిగులులేదు. - చైనా సమెత
ఉన్నత స్థానాలను చేరేకొదీ, మన నడకలో ఉదాత్తత పెరగాలి - సిసిరో
తీరని ప్రధమిక అవసరాలు,పేదరికం, అసమానతలమధ్య ఏ ప్రజాస్వామ్యమైనా ఎక్కువకాలం మనలేదు - జవహర్ లాల్ నెహ్రూ
చీమలు మంచి పౌరులు, వాటికి సమాజ ప్రయోజనమే ప్రధానం
హ్రుదయం కల్మషం అయితే అది చూపులలోనే ప్రతిఫలిస్తుంది.

Tuesday, December 24, 2013

ధర్మో రక్షతి రక్షితః

"ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్"
- మనుస్మృతి

ధర్మమనే పురుషార్థంలో నైతికమైన అవగాహన ఉంది. ధార్మిక చింతనము చోటు చేసుకొని ఉంది. ఇది వివేకానికి సంబంధించిన విషయం. విచారించే బుద్ధి కరువై, కేవలం సహజాతాలపై ఆధారపడి జీవించే జంతుజాలం ఈ ధర్మ పురుషార్థం వద్దకు చేరలేవు. ఇది కేవలం వివేకవంతులైన మానవులకే సంబంధించిన పురుషార్థం. మొదటి రెండు పురు షార్థాలైన అర్థకామాలను సాధించుకోవడంలో మనిషి సన్మార్గంలోనే చరించాలి. బుజుమార్గం లోనే పయనించాలి. ఇదే ధర్మజీవనం. చతుర్విధ పురుషార్థాలలో మూడవ పురుషార్థము.
నీ విషయంలో ఇతరులు ఎలా ఉండాలని భావి స్తావో, నీవు ఇతరుల విషయంలో అలాగే ఉండాలి. నీ విషయంలో ఇతరులు ఎలా ప్రవర్తించ కూడదని నీవు ఆశిస్తావో, నీవు ఇతరుల విష యంలో అలా ప్రవర్తించకుండా జీవించాలి. ఇదే ధర్మస్పహ. ధర్మమార్గం. ధర్మాన్ని ఎట్టి పరిస్థితు లలోను మానవులు అతిక్రమించకూడదు.
దారితప్పిన వారిని శిక్షించేందుకు, లేదా సంస్క రించేందుకు చట్టాలున్నాయి. దారితప్పిన మనిషి చట్టాన్ని కూడా తప్పించుకొనే ప్రయత్నం చేస్తాడు. మనిషి చట్టం కళ్లు కప్పి తప్పించుకోవచ్చు. కానీ ధర్మం, దైవం కళ్లు కప్పలేడు అంటూ మతం రంగప్రవేశం చేస్తుంది. భావం అంకురించనిదే కర్మ ఆచరింపబడదు. భావము కూడా కర్మే. మానస కర్మ. స్థూలకర్మకు స్థూలఫలితం ఎలా ఉంటుందో, భావన అనే సూక్ష్మకర్మకు సూక్ష్మఫలితం ఉంటుంది. ఈ సూక్ష్మఫలితాలే పాపపుణ్యాలు.
కర్మలు మానవాధీనాలు. ఫలితాలు దైవా ధీనాలు. చట్టాన్ని మనిషి తప్పించుకోవచ్చు. కాని పాపాన్ని తప్పించుకోలేడు. మానవనిర్మితమైన చట్టం మనిషికి న్యాయం చేయకపోవచ్చు. కానీ పుణ్యఫలం అతని కొరకు నిరీక్షిస్తూనే ఉంటుంది.
ధర్మం పవిత్రమైంది. ధర్మం దైవానికి ప్రతి రూపం. అర్థకామాలను వాంఛించేవారు ధర్మ బద్ధంగా జీవించడం అలవరచుకోవాలి. ధర్మంతో కూడిన కామం, ధర్మబద్ధమైన అర్థం సుఖ శాంతుల్ని పెంపొందిస్తాయి.
"చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;
రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;
కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు
మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి"
= స్వామి దయానంద - పండిత గోపదేవ్ ఆధారంగా
జ్ఞానం అన్నదే ప్రత్యక్షంగా మోక్షసాధనం
ధర్మం అన్నది పరోక్షంగా మోక్షసాధనం;
అంతేకాక, ముక్తపురుషుల తదుపరి కర్తవ్యం
           
మనిషి జ్ఞానగామిగా వెంటనే కాలేకపోయినా,
తాను నమ్మిన ధర్మాచరణను మాత్రం ఎలాంటి పరిస్థితులలోనూ వీడరాదు:
కనుకనే, బుద్ధ ధర్మం ప్రకారం –
"ధర్మం శరణం గచ్ఛామి"