Sunday, August 12, 2018

ఉత్తములు - మధ్యములు - అధములు : లక్షణాలు



ఆలోచనల, ప్రవర్తనా ధోరణి బట్టి మన సమాజంలో మూడు రకాల మనుషులు ఉన్నారు. వారు అధములు, మధ్యములు, ఉత్తములు.

అధములు:


  • తమంతట తామే వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.  అయితే వాటిని స్థిరంగా తీసుకోలేరు.
  • మిత్రులను తరచూ మారుస్తుంటారు. అందుకే వీరికి మిత్రులూ తక్కువే
  • వీరు సంబంధాలను నిలకడగా ఉంచుకోరు.
  • వీరి ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు.
  • డబ్బు విలువ తెలీదు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. అప్పులు కూడా ఎక్కువ.
  • చదువు విలువ తెలీదు.
  • సమయపాలన ఉండదు. ఏ పనీ టైంకు చేయరు.
  • వీరు ఎవర్నీ నమ్మరు. నమ్మినట్లు నటిస్తారు అంతే.
  • వీరికి నీతి వాక్యాలు  రుచించవు. తనకు ఎవరైనా మంచి చెపితే వారిపైనే విరుచుకు పడతారు.
  • వీరు అనుక్షణం ఎదుటివారిలో తప్పులు వెతుకుతుంటారు.
  • దేవుడిని నమ్మరు. తన తర్వాతే దేవుడు అనుకుంటారు.
  • తమకు జరుగుతున్న కష్టాలకు ఎదుటివారిని, దేవుడిని నిందిస్తారు.
  • బద్ధకం ఎక్కువ. ఎక్కువ నిద్రపోతూ ఉంటారు.
  • వీరు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. 
  • పొగడ్తలకు దాసోహం అవుతారు. పొగడ్తలతో వీరిని లొంగదీసుకోవచ్చు.
  • అంతేకాదు, వీరికి భయంకూడా ఎక్కువే. ప్రతీదానికీ విపరీతంగా భయపదిపోతూ ఉంటారు.
  • వీరికి “తాను” అనే స్వార్ధం ఎక్కువ. తన గురించి మాత్రమె ఆలోచిస్తారు.


మధ్యములు:


  • వీరు నిర్ణయాలు స్వంతంగా తీసుకోలేరు. ఎదుటివారిపై ఆధారపడతారు.
  • వీరికి స్నేహితులు ఎక్కువ. అన్నిరకాల స్నేహితులూ ఉంటారు.
  • సంబంధాలను తెంచుకోకూడదు అనుకుంటారు. కానీ సాధ్యం కాదు.  
  • అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంటారు. అయితే వారిలో ఏదైనా లోపం కనిపిస్తే ఇక మళ్ళీ వారి ముఖం చూడరు.
  • డబ్బు సంపాదించడమే గొప్ప అనుకుతారు. ఏంతొ సంపాదించినా  అది ఖర్చు పెట్టలేరు. పిసినారిగా ఉంటారు.
  • వీరు ఒకర్ని నమ్మితే వారితోనే ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటారు. మిగతావారి మాటలను లెక్క చేయరు.  
  • తాను నమ్మిన దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. అయితే వేరే దేవుళ్ళను విమర్శిస్తూ ఉంటారు.
  • కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోయి దేవుడిపై భారం వేస్తారు.
  • ఎదుటివారు తప్పులు చేసినప్పుడు మొగమాటం వల్ల చెప్పలేరు.
  • పొగడ్తలు అంటే వీరికి పడదు.
  • భయం కలిగినప్పుడు వేరొకరి సహాయం తీసుకుని బయటపడడానికి చూస్తారు.
  • సమయం విలువ తెలిసినా పాటించలేకపోతారు.
  • వీరికి తన కుటుంబం అనే స్వార్ధం ఎక్కువ. తానూ,తన కుటుంబం బాగుంటే చాలు. ప్రపంచం గురించి అవసరం లేదు.


ఉత్తములు :


  • అన్ని విధాల ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నా లెక్కచేయరు.
  • తన ఆలోచనలకు సరితూగే స్నేహితులను మాత్రమె ఎంచుకుంటారు. వీరికి స్నేహితులు తక్కువ.
  • మానవ సంబంధాలపై గౌరవం ఎక్కువ. సంబంధాలను తెంచుకోవాలనుకోరు.
  • ఎదుటివారిలో మంచిని చూస్తారు. వారు ఏదైనా తప్పులు చేస్తే చెప్పడానికి వెనుకాడరు. అలాగే మంచిపని  చేస్తే పొగడడానికీ వెనుకాడరు.
  • డబ్బు విలువ తెలుసు. ఎప్పుడు ఖర్చు పెట్టాలో అప్పుడు ఖర్చుపెడతారు.
  • అందరినీ సమదృష్టితో చూస్తారు.   
  • దేవుడు ఒక్కడే అని అందరు దేవుళ్ళూ సమానమే అని నమ్ముతారు.
  • కష్టాలు వచ్చినప్పుడు సహనంతో ఉంటారు. వాటి నుంచి భయపడడానికి అన్ని మార్గాలనూ వెతుకుతుంటారు.
  • ఎదుటివారి కష్టాలలో సాయపడుతూ ఉంటారు.
  • ఖచ్చితమైన సమయపాలన పాటిస్తారు. ప్రతీపనీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
  • వీరు అంతః సౌందర్యానికి విలువ ఇస్తారు. 
  • ధైర్యంగా ఉంటారు. అంతేకాదు ఎదుటివారికీ ధైర్యాన్ని ఇస్తారు.
  • ఎవరైనా పొగిడితే ఎలా తీసుకుంటారో, తిట్టినా అలాగే తీసుకుంటారు.
  • వీరికి సమాజంపై బాధ్యత ఎక్కువ. వీరు తనతోపాటూ సమాజం కూడా బాగుపడాలి అనుకుంటారు.


భగవద్గీతలో భగవానుడు చెప్పిన శ్లోకం

య‌ద్య‌దాచ‌ర‌తి శ్రేష్ఠః త‌త్త‌దేవేత‌రో జ‌నః

స య‌త్ప్ర‌మాణం కురుతే లోక‌స్త‌ద‌నువ‌ర్త‌తే


దీని అర్ధం - ఉత్తములైన వారు దేనిని ఆచ‌రిస్తారో, దానినే ఇత‌రులు కూడా ఆచ‌రిస్తారు.. అలానే ఉత్తములు దేనిని అయితే ప్రమాణముగా అంగీక‌రిస్తారో లోక‌మంతా కూడా దానినే అనుస‌రిస్తుంది అని.

అందుకే మనకు తారసపడే ఉత్తముల లక్షణాలను ఆచరణ చేద్దాం. మనం ఏ కోవకు చెందుతామో విశ్లేషించుకొని ఉత్తమ లక్షణాలను అలవర్చుకోడానికి ప్రయత్నిద్దాం.


No comments:

Post a Comment